తరలి రాదా వసంతం

Publisher: 
(web)
Story: 

మెల్లమెల్లగా పైకి వస్తున్న చంద్రుని కాంతి కిరణాలు అలల మీద పడి మెరుస్తున్నాయి. ఆ రోజు పౌర్ణమి అవటం వలన అలలు మరింత ఎత్తుకి ఎగసి పడుతున్నాయి.
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని ఆ దృశ్యాన్ని చూస్తూ కూర్చుండి పోయాడు రఘు. వచ్చి చాలా సేపయ్యిందనిపించి వాచ్ చూసుకున్నాడు. రేడియం ముళ్ళు పదకొండు గంటలు చూపిస్తున్నాయి. ఉదయం రైలుకి మద్రాస్ వెళ్ళాలి. కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యతలు స్వీకరించాలి అనుకుంటూ లేచాడు. దూరంగా ఒక స్త్రీ వడివడిగా సముద్రం వైపు వెళ్ళడం అస్పష్టంగా కనిపించింది. ఆ నడక అతనికి అనుమానాస్పదంగా అనిపించటంతో పెద్ద అడుగులేస్తూ ఒక్క ఉదుటున ఆమెని సమీపించాడు. అంతలో ఆమె సముద్రంలో దిగేసింది.
చటుక్కున ఆమె భుజాల్ని పట్టి ఇవతలికి లాగేడు. ఆమె మొదట గింజుకున్నా, చివరికి అతని బలమే నెగ్గింది. చేతిని పట్టుకొని ఒడ్డుకు తీసుకుని వచ్చి ఎదురుగా కూర్చునాడు.
వెక్కి వెక్కి ఏడుస్తోన్న ఆమెని కొంచెం సేపు ఏడవనిచ్చాడు.
"మీ పేరు?"
"ధారిణి."
"చెప్పండి. ఎందుకు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నారు?"
మొదట మౌనంగా ఉన్నా తర్వాత నెమ్మదిగా చెప్పింది. "ఈ వయస్సులో ఉండే ఆడపిల్లలకి ఏర్పడే సమస్యే. ప్రేమించిన... కాదు కాదు. ప్రేమించానని అనుకున్న మగవాడు మోసం చేసాడు. ఇంకో ఆరునెలల్లో తల్లినయే స్థితిలో ఉన్నాను. తఃల్లితండ్రులు చిన్నప్పుడే పోవడం వలన మేనమామ ఇంట్లో పెరిగాను. వాళ్ళూ అంతంత మాత్రమే. ఉద్యోగ రీత్యా ఈ ఊరికి వచ్చాను. ఇలా జరిగిందని తెలిస్తే అత్తయ్య నన్ను ఇంట్లోకి రానివ్వదు. ఎలా వాళ్లకి నా ముఖం చూపించను?" మళ్ళీ ఏడవ బోయింది.
"ఆపండి. మొదట ఆ ఏడుపు ఆపండి. జరిగినదేదో జరిగిపోయింది. ఆత్మహత్య వలన మీ పిరికితనాన్ని రుజువు చేస్తున్నారు." విసుగ్గా అన్నాడు.
"మీకేం? ఇలాంటి సమస్యలు మీకు రావు కాబట్టి నా పరిస్థితిని అర్థం చేసుకోలేక పోతున్నారు." కోపం ధ్వనించింది ఆమె స్వరంలో.
"సమస్యలు వేరైనా స్పందించే తీరులో ఆడ, మగ అని వేరు పడదు. వచ్చిన సమస్యను తెలివిగా పరిష్కరించుకోవాలే గాని ఇలా జీవితాన్ని అంతం చేసుకోవడం వలన నీవు బావుకునేదేముంది? నీ ప్రియుడు... అదే నిన్ను ప్రేమించానన్నవాడు సుబ్బరంగా పెళ్లి చెసుకొని పిల్లలి కని జీవితాన్ని అనుభవించగా లేనిది, నీవు మాత్రం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?'
"నన్నేం చేయమంటారు?' కొంచెం తేరుకున్నదానిలా అంది.
"డాక్టర్ని కన్సల్ట్ చేసి అబార్షన్ చేయించుకొని జీవితాన్ని ఫ్రెష్ గా ప్రారంబించు. ఏ హెల్ప్ అయినా నేను చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఐ మీన్ పైనాన్షియల్ గా ."
"ఆ పని మాత్రం చేయలేను. ఏ తప్పూ చేయని శిశువుని హత్యా చేసి నా మానాన్న నేను ఏమీ ఎరగనట్లు జీవితం కొనసాగించలేను."
ఆమె కంఠం రుద్ధమయ్యింది. "కాని ఆ శిశువును పెంచగలిగే ధైర్యం నాకు లేదనే అనిపిస్తోంది." కన్నీటిని అరికట్టలేక మోకాళ్ళ మధ్య తలదాచుకుంది.
"సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే కాదు. ఆ నిర్ణయాన్ని అమలు పరచ గలిగినప్పుడే జీవితం మన అధీనంలో ఉంటుంది. లేకపోతే గాలి వాటుకు ఊగిపోయే రెల్లు గడ్డిలా ఏ మాత్రం విలువ లేకుండా అయిపోతుంది. కడుపులోని శిశువుని హత్య చేయడానికి వెనకాడే నీవు ఆత్మహత్యకి ఎలా సిద్ధపడ్డావో నాకర్థం కావడం లేదు. నీ ఆత్మహత్యతో ఆ శిశువూ సజీవ సమాధి అవుతుందన్న సంగతి ఎలా మర్చి పోయావు?" రెట్టించిన కోపంతో అన్నాడు.
సమాధానం చెప్పలేని దానిలా తలదించు కుంది.
కొద్దిసేపు మౌనంగా అలల వైపు చూస్తూ కూర్చున్న రఘు, ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా అన్నాడు. "నీవు నన్ను నమ్మేటట్లయితే ఓ మార్గం చెబుతాను. నీకు సరేనని అనిపిస్తే ఒప్పుకో. లేకపోతే బలవంతమేమీ లేదు. రేపు నేను మద్రాసుకి కొత్త ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్నాను. అక్కడ నన్నెరిగిన వారు ఎవరూ లేరు. నా భార్య అన్న హోదాలో నీవు నాతో వస్తే డెలివరి అయ్యేవరకు నా రక్షణ నీకు ఉంటుంది. పుట్టబోయే శిశువు బాధ్యతను నేను తీసుకుంటాను. ఆ తర్వాత నీవు కొత్తగా జీవితం ప్రారంభించదానికి ఎటువంటి కష్టమూ ఉండదనుకుంటాను. సరేనా?'
చివాల్న తలెత్తి చూసింది. అతని కళ్ళు నిర్మలంగా, స్వచ్చంగా ,స్పటికంలా ఉండే అతని మనసుని ప్రతిఫలిస్తున్నాయి. ఏదో ఒక బలహీనమైన క్షణంలో ఆత్మహత్యకి సిద్ధం అయ్యిందే గాని, బ్రతుకుపై తీపి ఇప్పుడా పనిని చెయ్యనివ్వడం లేదు. అతని మాటల్ని నమ్మడంలో ఆమెకి ఎటువంటి అభ్యంతరమూ కన్పించలేదు.
మౌనంగా తలూపింది.
"రేపు మద్రాస్ వెళ్ళే రైలులో నీకోసం టిక్కెట్ రిజర్వ్ చేయిస్తాను. నేరుగా స్టేషనుకి వచ్చేయి. నీ కోసం వెయిట్ చేస్తుంటాను."
మద్రాసులో రైలు దిగగానే రఘుని రిసీవ్ చేసుకోవడానికి ఆఫీసర్లు వచ్చారు. భుజం చుట్టూ కొంగు కప్పుకొని రఘు వెనక నిలబడిన ధారిణిని చూసి అతని భార్యగా గుర్తించడంలో వాళ్ళు ఏ మాత్రమూ తటపటాయించలేదు.
"గుడ్ మార్నింగ్ సార్! మీ కోసం క్వార్టర్స్ రెడీగా ఉంచాము. సామాన్లన్నీ లారీలో వస్తున్నాయా? సామాన్లన్నీ ఇంట్లో సరిగ్గా అమర్చే పూచీ మాది. మేడం వట్టి మనిషి కూడా కానట్లున్నారు. ఏ మాత్రమూ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మరి." కాస్త వయస్సు మళ్ళిన ఆఫీసర్ అన్నాడు. ఆయన మొదటి కూతురు నిండు చూలాలిగా ఇంట్లో ఉంది. రేపో మాపో డెలివరి అవవచ్చు.
చెప్పినట్లుగానే రఘు ధారిణికి ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేయించి మందులు రెగ్యులర్ గా వాడేటట్లు చూసుకున్నాడు. సాయంత్రాలలో ఆమెని వాకింగ్ తీసుకొని వెళ్ళేవాడు. మొదట్లో తూచీ తూచీ మాట్లాడే ధారిణి అతని మాటల గారడీకి తాను ఆకర్షితురాలవుతున్నట్లు గ్రహించింది. ప్రతి రంగంలో అతనికి ఉన్న విషయ పరిజ్ఞానం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. కొంత మంది స్వరంలో కమాండింగ్ ఉంటుంది. అతని స్వరం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వేణు నాదంలా ...
ధారిణికి రఘు ప్రత్యేకమైన వ్యక్తిలా కన్పించ సాగాడు. అంతవరకు ఆమె ఎరిగి ఉన్న ప్రపంచంలో యింత ఉదాత్తమైన గుణాలు కలిగి ఉన్న మగవాడు తారస పడలేదు.
చిన్నప్పట్నుంచి పెరిగిన మేనమామ ఇంట్లో వెకిలిగా ప్రవర్తించే అత్తయ్య తమ్ముడు, చదువుకునే రోజుల్లో వెంట బడిన రోమియోలు, ఆఖర్న ప్రాణప్రదంగా ప్రేమించానుకున్న అతడు! జరిగిన దాంట్లో తన బాధ్యత ఏ మాత్రమూ లేదన్నట్లు దులుపుకుని వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులైనా రఘు తన గతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించ లేదు. అతని గురించి తనకీ ఏమీ తెలియదు. అతని తల్లి తండ్రులు ఎవరు? ఒంటరి వాడేనా?
*****
"మీకు ఈ గులాబీ రంగు చీర చాలా బాగా ఉంది. మా అమ్మకీ ఆ రంగంటే చాలా ఇష్టం" అన్నాడు రఘు.
పార్కులో కూర్చుని గడ్డి పరకలు తెంపుతున్న ధారిణి అతని ప్రశంసను స్వీకరిస్తున్నట్లు చిరునవ్వుతో అన్నది. "ఎప్పుడూ మీ అమ్మగారి సంగతే చెప్తారు. బాగా వంట చేస్తారని, అలా ఉంటారని, ఇలా ఉంటారని. ఒక్కసారి కూడా ఫోటో అయినా చూపించలేదు మీరు. ఊర్లో ఉంటారా ఆవిడ? మీ నాన్నగారేం చేస్తుంటారు? ఆయన పేరేంటి?"
వెంటనే జవాబు చెప్పలేదు రఘు. దూరంగా అస్తమిస్తున్న సూర్యుడినే చూస్తూ ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసిన ధారిణికి తాను తప్పు చేసిందేమోనని అనిపించింది.
"మీ స్వవిషయాలు నాతో చెప్పడానికి ఇష్టపడక పోవచ్చు. క్షమించండి."
'అహ.. అలాంటిదేమీ లేదు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను." మాటల కోసం వెతుక్కుంటున్న వాడిలా ఆగాడు.
"ఒక విధంగా చెప్పాలంటీ మా అమ్మ కధ కూడా నీ లాంటిదే ధారిణీ! మానసికంగా ఎదగని వయస్సులోనే పక్కింటికి చుట్టపు చూపుగా వచ్చిన వ్యక్తిని ప్రేమించింది. అతనూ తనని ప్రేమిస్తున్నాడని అనుకుంది. ప్రేమకి పర్యవసానం పెళ్ళే అని అనుకున్న ఆమె అతని నిజ స్వరూపాన్ని సరిగ్గా గుర్తించ లేకపోయింది. నెల తప్పిందన్న విషయం తాతయ్యకి తెలియగానే మొదట అమ్మని బాగా కొట్టారట. ఆ తర్వాత అమ్మతో వాళ్ళింటికి న్యాయం అడిగడానికి వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య వున్న బంధం 'అన్నాచెల్లెళ్ళ 'లాటిదట. ఆ మాటల్ని విన్న తాతయ్య అక్కడే కూలిపొయాడు. శారీరక సంబంధం పెట్టుక్కున్న అమ్మాయిని పట్టుకొని చెల్లెల్లాంటిదని అనడం ఎంత దారుణం అంటే, నిజంగా అతనికో చెల్లెలు ఉంటే, అతనిక్కాస్త దూరంగానే ఉండాలి. అంత నీచమైన వ్యక్తులున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.
తెలిసిన కుట్టుపని సహాయంతో తన బ్రతుకు కో దారి ఏర్పరుచుకుంది. నాకు వివరం తెలిసే వయసు వచ్చాక తన కధను చెప్పింది. అతని పేరేమిటో కూడా తను చెప్పలేదు. నేనూ అడగలేదు. ఐ.ఎ.ఎస్. పరీక్షకి ప్రిపేర్ అవుతుండగా, ఆమెకి ఒంట్లో బాగా లేదని డాక్టర్ దగ్గిరికి వెళ్లినప్పుడు కాన్సర్ అని తెలిసింది. అడ్వాన్స్ డ్ స్టేజి. అప్పుడు కూడా ఆమె ఒకే మాట అన్నది. తనకేదైనా అయినా కూడా నేను పరీక్షలు రాయడం మానకూడదని. పరీక్షలు ముగిసేటప్పుడు అమ్మ పోయి నాలుగు రోజులు." అతని గొంతు కాస్త వణికింది.
"ఐ యాం వెరి సారీ. మిమ్మల్ని బాధ పెట్టాననుకుంటాను." అనునయంగా అంది ధారిణి.
"ఇట్సాల్ రైట్. చీకటి పడుతున్నట్లుంది. వెళ్దామా మరి." ధారిణికి చేయూత నివ్వడానికన్నట్లు చేయి చాపాడు. నెలలు
నిండటం వలన వెంటనే లేవలేని ధారిణి ఒక చేతిని నేలమీద ఆనించి, మరో చేతితో అతని చేయి పట్టుకోవాలనుకుంటుండగా నే కడుపు లో మెలిక పెట్టినట్లు నెప్పి.
"అమ్మా!" పళ్ళ బిగువన బాధను భరించడానికి ప్రయత్నించింది.
"ఏమైయ్యింది ధారిణీ? ఎనీ ప్రాబ్లం?" కంగారుగా అన్నాడు.
"ఏమీ లేదు. కాస్త నెప్పిగా అనిపించింది. అంతే." తనని తాను కుదుట పరుచుకునే ప్రయత్నంలో ఉండగానే, మళ్ళీ అదే మెలిక, మరింత ఉదృతంగా.
"అమ్మా!" వంగి పోయింది.
"ధారిణీ! ఆటో తీసుకొస్తాను. పద. హాస్పిటల్ కి వెళదాం." పరిగెత్తినట్లుగా వెళ్ళాడు రఘు.
*******
డాక్టర్ పరీక్షలు ముగించి బైటికి రాగానే,
"డ్యూ డేట్ కి ఇంకా పది రోజులున్నాయి డాక్టర్. ఇప్పుడు ఇలా..."
అతని కంగారుని అర్థం చేసుకున్న డాక్టర్ చిరునవ్వుతో అన్నది. "మీ అబ్బాయి అన్ని రోజులు ఆగనంటున్నాడు మరి. ఇంకో గంటలో డెలివరి అయిపోతుందను కుంటాను. మీరు త్వరగా వెళ్లి ఈ మందులు, ఇంజెక్షన్స్ త్వరగా తీసుకొని రండి" అని ప్రిస్క్రిప్షన్ చేతికి అందించింది.
"కంగ్రాట్స్! మీ మిసెస్ కి బాబు పుట్టాడు. మీరు లోపలి వెళ్లి చూసుకోవచ్చు." అభినందిస్తూ అంది డాక్టర్.
బెడ్ మీద ధారిణి పడుకొని ఉంది. అలసినట్లుగా కనిపించే ఆ ముఖం, ప్రక్కనే పొత్తిళ్ళలో బాబు, అప్పుడే అరవిచ్చిన పువ్వులా తెల్లగా, చిన్ని చిన్ని కాళ్ళు చేతులు ఆడిస్తూ... బాబునే చూస్తూ ఉన్నదల్లా అడుగుల చప్పుడికి తలతిప్పి చూసింది.
సంతోషంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి. "ఎలా ఉన్నావు ధారిణీ? బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు?"
అలవాటయిన వాడిలా నేర్పుగా పొత్తిళ్ళలో వున్న బాబును చేతిలో తీసుకున్నాడు."కనుముక్కు తీరు అంతా నీ పోలికే అనిపిస్తోంది." అపురూపంగా బాబుని హత్తుకున్నాడు.
నార్మల్ డెలివరి అవడం వలన నెల రోజులు తిరగకుండానే ధారిణి తేలికగా ఇంటి పనులు చేసుకోవడం మొదలు పెట్టింది. ఆఫీసు నుంచి వచ్చిన రఘు కాపీ తాగుతూ పత్రికను తిరగేస్తూ కూర్చున్నాడు.
"బాబు ఏం చేస్తున్నాడు ధారిణీ? చప్పుడే లేదు?"
"ఇప్పుడే నిద్ర పోయాడు." మంచం మీద నిద్ర పోతున్న బాబుకి దుప్పటిని సరి చేసింది. ఏదో చెప్పాలని ఆమె తటపటాయించడం చూసిన రఘు పుస్తకాన్ని టేబుల్ మీద పెడుతూ అన్నాడు.
"ధారిణీ! ఎనీ ప్రాబ్లం? నా దగ్గర చెప్పడానికికూడా సంశయమెందుకు?"
మనసులోని మాటను కనిపెట్టినట్లు అతను అడగగానే ఆమె ఏదో నిశ్చయించు కొన్నదానిలా అన్నది.
"ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఏదైనా ఉద్యోగం చూసుకొని నా కాళ్ళపై నేను నిలబడాలని అనుకుంటున్నాను." మెల్లగా అయినా స్పష్టంగా అన్నది.
"బాబును వదిలి నీవు ఉండగలవా ధారిణీ?"
హఠాత్తుగా ఆ ప్రశ్న అడగడంతో అదిరిపడింది. తల అడ్డంగా ఊపుతూ అన్నది. "బాబును నేనే పెంచుతాను. ఎలాగైనా, ఎన్ని కస్టాలు పడి అయినా సరే."
"చెప్పినంత సులభంకాదది. అవివాహిత అయిన తల్లికి, ఆ కొడుక్కి ఈ లోకంలో ఎటువంటి మర్యాదలు, మన్ననలు దొరుకుతాయో నీకంటే నాకే బాగా తెలుసు. ఉద్యోగం చూసుకొని నీ కాళ్ళపై నీవు నిలబడాలనుకోవటం సరియైన ఆలోచనే కానీ, నీ భవిష్యత్తు మాటేమిటీ? ఇంత చిన్న వయస్సులో తోడు ఎవరూ లేకుండా ఒంటరిగా ఎందుకు పోరాడాలి? బాబుకి ఏ కొరత రాకుండా నేను చూసుకుంటాను. సరైన తోడు దొరికితే పెళ్లి చేసుకొని స్థిర పడటం మంచిదని నా అభిప్రాయం." నెమ్మదిగా అన్నాడు.
"బాబు లేని జీవితాన్ని ఊహించడం కూడా నాకు సాధ్యపడటం లేదు. అన్నీ మరిచిపోయి కొత్తగా జీవితం ప్రారంభించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ ఎన్నాళ్ళిలా మీ మీద ఆధారపడి ఉంటూ మీ భవిష్యత్తునూ నాశనం చేస్తూ ఇక్కడ ఉండను?"
కళ్ళలో తిరిగిన నీరు అతని కంట పడకూడదన్నట్లు గా తల దించుకుంది.
కిటికీలో నుంచి బయట చూస్తున్న వాడల్లా యిటు తిరిగేడు.
"నీకభ్యంతరం లేకపోతే నన్ను నీ భర్తగా స్వీకరించ గలవా ధారిణీ? అవసరం లేదు. ఆలోచించుకొనే చెప్పు. నీ ఇప్పటి పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్నానని అనుకోకు. నాన్న ఎవరో తెలియని ఆ పరిస్థితి, చుట్టూ ఉన్న లోకం చేసే అవహేళన, తిరస్కారం మళ్ళీ ఈ బాబు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. మంచి తల్లి తండ్రుల పెంపకంలో పెరిగిన పిల్లల ప్రపంచం ఎలా ఉంటుందో ఊహలలోనే నాకు తెలుసు. దాన్ని నిజం చేసుకోవాలి. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా మనస్సులో ముద్ర వేశావు. ముందే చెప్పాలనుకున్నా స్వార్థపరుడిగా అనుకుంటావేమోనన్న జంకుతో ఇన్నాళ్ళు చెప్ప లేక పోయాను. చెప్పు ధారిణీ! నన్ను నీ బాబుకి తండ్రిగా, నీ భర్తగా స్వీకరించగలవా?"
స్థాణువుగా నిలబడి పోయింది ధారిణి. తను వింటున్నది, కంటున్నది కల కాదుకదా? తనకంత అదృష్టం కూడానా? రఘు తనని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడా?
కళ్ళలో తిరిగిన నీరు అతని కంట పడకూడదన్నట్లుగా తల దించుకుంది. నిద్రలో బాబు కెవ్వుమన్నాడు. ఆ కేకతో ఈ లోకంలోకి వచ్చింది. మంచం దగ్గరికి వెళ్లి బాబుని సముదాయించి నిద్ర పుచ్చాడు రఘు. ఆ క్షణాన అతన్ని చూస్తుంటే ఎంతో హాయిగా అన్పించింది ధారిణికి. అంతవరకూ గుండెల్లో ఉన్న భారం అంతా ఎవరో చేత్తో తీసేసినట్లనిపించింది. బాబును చెరో పక్కా పట్టుకొని నడిపిస్తూ...
"ధారిణీ! కలగంటున్నావా?" ముఖం ముందు చిటికె వేశాడు.
"అవును. బంగారు కలలో మునిగి పోయాను. మీరూ, నేను బాబును స్వర్గం లో వున్న తోటలో చెరో ప్రక్కా చేతిని పట్టుకొని నడిపిస్తున్నామట."
అర్థం కాని వాడిలా చూసాడు.
"అర్థం కాలేదా? ఇంత మొద్దావతారంతో జీవితమంతా ఎలా వేగను బాబూ?' అల్లరిగా నుదిటిని చేత్తో కొట్టుకుంది.
ఆమె మాటల్లోని భావం గ్రహించగానే అతని ముఖం వెలిగి పోయింది. ఒక్క ఉదుటున ఆమెను చేరి రెండు చేతుల్లోనూ చుట్టేసాడు.
"ధాంక్ యు డియర్!" మృదువుగా నుదిటి మీద పెదాలతో స్పృశిస్తూ అన్నాడు.
(22-5-96) ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక